పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రివ్యూ: ఆద్యంతం 'వీరమల్లు' పోరాటమే..!

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రివ్యూ: ఆద్యంతం 'వీరమల్లు' పోరాటమే..!

4 months ago | 5 Views

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన  చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా రెట్టింపు అయ్యాయి.  జూలై 24 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సమ్ థింగ్ స్పెషల్ డే. ఇరవై యేడేళ్ళ క్రితం ఇదే రోజున 'తొలిప్రేమ'  చిత్రం విడుదలై  భారీ విజయాన్ని అందుకుంది.  అప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలను మించిన విజయాన్ని 'తొలిప్రేమ' నమోదు చేసుకుంది. సరిగ్గా అదే రోజున ఈ యేడాది 'హరిహర వీరమల్లు'  ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు... ప్రజా ప్రతినిధి కూడా.  దాన్ని మించి ఏపీ డిప్యూటీ సీఎం. అంతే కాకుండా గత కొంతకాలంగా హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకున్న వ్యక్తిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.   పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇటు అభిమానులను, అటు సాధారణ ప్రేక్షకులను; మరోవైపు పార్టీ కార్యకర్తలను, ఇంకోవైపు హిందుత్వ వాదులను కూడా సంతృప్తి పర్చాల్సిన పరిస్థితి.  పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉండటం ఖాయం. మోడెస్టీ కోసం ఆయన తన సినిమాలను మిగిలిన స్టార్ హీరోల చిత్రాలతో తక్కువగా పోల్చుకున్నా... అభిమానులు దాన్ని అంగీకరించరు.  పవన్ కళ్యాణ్  చిత్రాలు 'ఖుషీ, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది'  అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే... గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ఇటు పాలిటిక్స్, అటు సినిమాలపై జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. దాంతో పూర్తి స్థాయిలో నటన మీద దృష్టి పెట్టలేని పరిస్థితి. దాదాపు ఐదేళ్ళ క్రితం మొదలైన 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలోనూ అదే జరిగింది. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టైట్ పొజిషన్ లో డేట్స్ ఇచ్చి... ఎలానో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' పై పలు రకాల సందేహాలు ఉండటం సహజం. పైగా దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత దానిని టేకప్ చేసిన జ్యోతికృష్ణ  ఏమేరకు ఈ కథకు న్యాయం చేస్తాడోననే అనుమానాలూ ఉంటాయి. అయితే... థియేటర్ లో ఒకసారి బొమ్మ పడిన తర్వాత ఎండింగ్ వరకూ తలతిప్పుకోకుండా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపుకు తెరపడింది. ఎ. ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా నేడు (24 జులై-2025) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ బిగ్ అండ్ మల్టిపుల్ టాస్క్ ను పవన్ కళ్యాణ్ ఏ మేరకు అధిగమించాడు.. 'హరిహర వీరమల్లు'గా ఇటు అభిమానులు.. అటు ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించాడో.. తెలుసుకుందాం.. 


కథలోకి వెళితే.. ఈ 'హరిహర వీరమల్లు' 7వ శతాబ్దానికి చెందిన కథ. కృష్ణనదిలో కొట్టుకు వచ్చిన ఓ పసిబిడ్డను గూడెం ప్రజలు రక్షించి శివాలయంలో పూజారికి ఇస్తారు. ఆయన ఆ పిల్లాడికి హరిహర వీరమల్లు అనే పేరు పెడతాడు. పెరిగి పెద్దవాడైన వీరమల్లు దొరలను దోచుకుని లేనివారికి సాయం చేస్తుంటాడు. కృష్ణాతీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటీషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవులో వీరమల్లు అడ్డుకుని, వారికి బుద్ధి చెబుతాడు. అతని సాహసాల గురించి తెలుసుకున్న దొర అతనితో దోస్తీ కడతాడు. దొర కోరిక మేరకు గోల్కొండ ఖిల్లాకు బయలుదేరిన వీరమల్లు తన ధైర్యసాహసాలతో నవాబును మెప్పిస్తాడు. దాంతో ఢిల్లీ బాద్ షా ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తెచ్చి ఇవ్వమని తానీషా కోరతాడు. నవాబు మీద ప్రేమకంటే తెలుగునేలకు చెందిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం ఆత్మగౌరానికి సంబంధించిందని భావించిన వీరమల్లుకు అందుకు అంగీకరిస్తాడు. హైదరాబాద్ నుండి ఢిల్లీ నగరానికి అతని ప్రయాణం ఎలా సాగింది? మధ్యలో ఎదురైన అవాంతరాలు ఏమిటీ? హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను కట్టాలని శాసించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కు వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడు? అనేది మిగతా కథ. రాబిన్ హుడ్ ను తలపించే వీరమల్లు చర్యల వెనుక ఉన్న నిగూఢ అర్థం ఏమిటీ? హిందుధర్మం మీద జరుగుతున్న దాడులపై వీరమల్లు ఎలా ప్రతిస్పందించాడు? ధర్మ పరిరక్షకుడిగా ఎలా నిలిచాడు? వంటి అంతర్లీన సన్నివేశాలను తెర మీద చూసి తీరాల్సిందే.


 విశ్లేషణ: సినిమా ఆద్యంతం వీరమల్లు పోరాటంతోనే సాగింది. ఆ రకంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.  ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలోనూ ఉన్న పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చే కొన్ని డైలాగ్స్ జనసేన కార్యకర్తలలో జోష్ నింపేవిగా ఉన్నాయి.  అట్టడుగు వర్గాల వారిపై దొరలు చేసే దాష్టికాన్ని, వారిని దోచుకునే కులీ కుతుబ్ షాహీల దౌర్జన్యాన్ని, వాళ్ళను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకునే మొఘల్ చక్రవర్తిని వీరమల్లు ఎలా దారిలోకి తెచ్చాడన్నది ఆసక్తికరంగా సాగింది. కృష్ణానదీ తీర ప్రాంతంలో మొదలైన ఈ కథ హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా హిందువులపై మతపరంగా జరిగిన దాడులను కూడా సందర్భానుసారంగా  తెరకెక్కించారు.  వీరమల్లు విజయ గాథలో నిజానికి హీరోయిన్ కు స్థానం లేదు. అయినా సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం, కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించి, పంచమి పాత్రను ప్రవేశ పెట్టారు. అలానే హాస్యం పండించడం కోసం మరికొన్ని పాత్రలను సృష్టించారు. కానీ అవేవీ  అంతగా ఆకట్టుకోలేదు. ఇక పంచమి పాత్రకు సంబంధించి విశ్రాంతికి ముందు ఇచ్చిన ట్విస్ట్ బేషుగ్గా ఉంది.  అలానే క్రూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూజ్ బంప్స్ తెప్పించేదే!  అయితే.. విస్తారమైన కథ, భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్... ఇవేవీ మనసు లోతుల్లోకి వెళ్ళి ప్రభావం చూపించలేకపోయాయి. ఎవరో మొదలు పెట్టిన వంటను... వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే... పవన్ కళ్యాణ్ ఈ సినిమాను టేకిట్ గ్రాంట్ గా చేయలేదనే విషయం ప్రతి ఫ్రేమ్ లోనూ మనకు ఇట్టే కనిపిస్తుంది. క్షణం తీరిక లేని సమయంలోనూ చాలా నిబద్ధతతో పవన్ షూటింగ్ లో పాల్గొన్నారనే విషయం అర్థమౌతుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ కు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. పంచమిగా నిధి అగర్వాల్  తెర మీద అందంగా కనిపించింది. షూటింగ్ ఏళ్ళ తరబడి జరగడంతో కొన్ని సన్నివేశాల్లో బొద్దుగానూ ఉంది. ఔరంగజేబు గా బాబీ డియోల్, చిన్న దొరగా సచిన్ ఖేడేకర్, తానీషాగా దిలిప్ తాహిల్ నటించారు. పెద్ద దొర పాత్రలో కోట శ్రీనివాసరావు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. సత్యరాజ్, ఈశ్వరీరావ్, మురళీశర్మ, రఘుబాబు, సునీల్, నిహార్ కపూర్, సుబ్బరాజు, నాజర్, కబీర్ బేడీ, భరణీ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వీరితో పాటు  ఇంకా చాలామందే ఇందులో కనిపిస్తారు. 

టెక్నీకల్ గా చూస్తే.. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి 'హరిహర వీరమల్లు'కు తన స్వరాలతోనే కాదు నేపథ్య సంగీతంతోనూ ప్రాణం పోశారు. 'తార తార..' పాట మాస్ ప్రేక్షకులను కవ్విస్తే; అనసూయ, పూజితా పొన్నడ పై చిత్రీకరించిన 'కొల్లగొట్టి నాడురో' పాట కుర్రకారులో జోష్ నింపేలా ఉంది. పవన్ కళ్యాణ్ పాడిన 'మాట వినాలి...' పాట ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. సన్నివేశాలను ఎలివేట్ చేసేందుకూ కొన్ని నేపథ్య గీతాలను పెట్టారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస తమ సినిమాటోగ్రఫీ సిల్క్స్ ను బాగా ప్రదర్శించారు. తోట తరణి ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశారు. పోరాట సన్నివేశాలు మాస్ ప్రేక్షకులు  మెచ్చేలానే ఉన్నాయి. మొత్తానికి  నిరంకుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వీరమల్లు చుక్కలు చూపిస్తాడనుకుంటే దాన్ని రెండో భాగానికి వాయిదా వేయడం కాస్తంత నిరాశను కల్గించే అంశం. అయితే నిర్మాతలు ఎ. ఎం. రత్నం, దయాకరరావు, దర్శకుడు జ్యోతికృష్ణ కృషిని తక్కువ చేయలేం. పవర్ స్టార్ అభిమానులను, హిందుత్వ వాదులను, జనసైనికులను 'హరిహర వీరమల్లు' సంతృప్తి పరుస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.  

రేటింగ్: 3/5

ఇంకా చదవండి: ఉన్ని ముకుందన్ హోరోగా లెజెండరీ డైరెక్టర్ జోషీ కొత్త చిత్రం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పవన్ కళ్యాణ్     # హరిహర వీరమల్లు    

trending

View More