మోగ్లీ 2025 రివ్యూ:  సాదాసీదా కథ !

మోగ్లీ 2025 రివ్యూ: సాదాసీదా కథ !

4 days ago | 5 Views

(చిత్రం : మోగ్లీ 2025,  విడుదల తేదీ : డిసెంబర్ 13, 2025,   రేటింగ్ : 2/5, నటీనటులు : రోషన్ కార్తీక్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు (అతిథి పాత్ర‌ల్లో సుహాస్‌, రియా సుమ‌న్) త‌దిత‌రులు, సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రాఫర్ : రామ మూర్తి ఎం, ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్,  నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌, ద‌ర్శక‌త్వం: సందీప్ రాజ్.నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ)

 యంగ్ హీరో రోషన్ కనకాల, సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రం 'మోగ్లీ 2025' ఈ వారం విడుదలయింది.  ఈ సినిమాలో  స్టార్ లు లేక‌పోయినా స‌రే విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల్లో  ఆస‌క్తిని.. అంచ‌నాల్ని పెంచింది.  అందుకు కార‌ణం.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌డం.. 'క‌ల‌ర్‌ఫొటో' ఫేం సందీప్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కావ‌డ‌మే. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా బండి స‌రోజ్‌కుమార్ న‌టించ‌డంతో  ఈ సినిమా  మ‌రింత ప్ర‌త్యేక‌త‌ని తీసుకొచ్చింది.  మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. 

కథ : పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో నివసించే ముర‌ళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ క‌న‌కాల‌) ఓ అనాథ . చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడు ఎస్సై కావాల‌నేది లక్ష్యంగా పెట్టుకుంటాడు.  తన ఊరి ప‌క్క‌న ఉన్న అడ‌వినే త‌న అమ్మగా భావిస్తూ..  సినిమా చిత్రీక‌ర‌ణ‌ల కోసం వ‌చ్చే యూనిట్స్‌కు సహకారం చేస్తూ  కాలం గడిపేస్తుంటాడు. ఈ క్రమంలో  ఓ సినిమాలో  డూప్‌గా న‌టించే అవకాశం  వ‌స్తుంది. షూటింగ్ కోసం వచ్చిన ఒక మూగ, చెవిటి అమ్మాయి వర్ష అలియాస్ జాస్మిన్ (సాక్షి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇద్ద‌రి మ‌న‌సులు క‌లుస్తాయి. తాను రాముడైతే, జాస్మిన్ సీత అంటాడు మోగ్లీ. అంతా స‌వ్యంగా సాగిపోతుంద‌నుకుంటే సీతారాముల్లాంటి ఆ జంట మ‌ధ్య‌కు రావ‌ణుడిలా వ‌స్తాడు  స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్).  సీత‌ లాంటి జాస్మిన్‌పై క‌న్నేస్తాడు. ఎలాగైనా ఆమెని లోబ‌రుచుకోవాల‌ని ప‌థ‌కం పన్నుతాడు. దాంతో మోగ్లీ, జాస్మిన్ అర‌ణ్య‌వాసం చేయాల్సి వ‌స్తుంది. ఇలా వీరి లవ్ ట్రాక్ లోకి  పోలీస్ ఆఫీసర్ వచ్చాక ఏమైంది? మోగ్లీ త‌న జాస్మిన్‌ని అతడి నుంచి కాపాడుకోగ‌లిగాడా, లేదా?  ఈ క్రమంలో  మోగ్లీ  ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?  కోల్పోయింది ఏంటి? చివరికి తన ప్రేమ గెలిచిందా లేదా? అనేదే మిగ‌తా క‌థ‌.


విశ్లేషణ: అన్ని ప్రేమ‌క‌థ‌లూ ఇంచుమించూ ఒకేలా ఉంటాయి. కానీ ఆ ప్ర‌యాణాన్ని ఎంత కొత్త‌గా ఆవిష్క‌రించార‌న్న‌దే ఆ సినిమా ఫ‌లితాన్ని నిర్దేశిస్తుంది. హ‌త్తుకునే భావోద్వేగాల‌పై దృష్టిపెడుతూ, మ‌రింత ప‌దునైన క‌థ‌నంతో చెప్పాల్సిన క‌థ ఇది. కానీ అన‌వ‌స‌ర‌మైన సంభాష‌ణలు, స‌న్నివేశాల‌తో సినిమా సాగుతూనే ఉందన్న అభిప్రాయం క‌లుగుతుంది.  హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం, దాన్ని ఒక‌రికొక‌రు వ్య‌క్తప‌రుచుకోవడం, ఆ త‌ర్వాత ఎడ‌బాటు.. ఇలా అన్ని ప్రేమ‌ క‌థ‌ల్లాగే ఇదీ సాగుతుంది. కర్మఫ‌లం అనే అంశం మొద‌లుకొని సీతారాములు, ఆంజనేయుడు, రావ‌ణుడిని గుర్తు చేస్తూ సినిమాకి పురాణాన్నీ, భ‌క్తినీ మేళ‌వించారు.  అడ‌వి నేప‌థ్యంలో సాగే ఓ ప్రేమ‌క‌థ ఇది.  నేప‌థ్యం, పాత్రల తీరుతెన్నుల్లో కొత్త‌ద‌నం కోసం ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం తెర‌ పైన క‌నిపిస్తుంది.  సైలెంట్ ల‌వ్‌స్టోరీ విత్ లౌడెస్ట్ వార్... అని ప్ర‌క‌టిస్తూ విరామ‌మిచ్చిన ద‌ర్శ‌కుడు... ద్వితీయార్ధంలో సాగే యుద్ధంలోనైనా కొత్త‌ద‌నం చూపిస్తాడ‌నుకుంటే, అక్క‌డ క‌ర్మఫ‌లం అంటూ క‌థ‌ని ప‌లు మ‌లుపులు తిప్పినా ఫ‌లితం మాత్రం అంతగా క‌నిపించ‌దు . ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ, క‌థ‌నాలు... భావోద్వేగాల ప‌రంగా ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌ని స‌న్నివేశాలు, ఎంత‌కీ పూర్త‌వ‌దనేలా సినిమా నిడివి కూర్చున్న‌చోటే అలసిపోయేలా చేస్తాయి.  అయితే.. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా సాగదీతగా తీసుకెళ్తూ చెప్పడం జరిగింది. హీరో, హీరోయిన్ ట్రాక్ లని అనవసరంగా సాగదీసినట్టుగా ఉంటుంది. మొదటి కొన్ని నిమిషాల ఎస్టాబ్లిష్మెంట్ డీసెంట్ గా అనిపిస్తుంది కానీ నెమ్మదిగా పరిస్థితులు ఇంట్రెస్ట్ లేకుండా చాలా రొటీన్ గా వెళతాయి.  సెకండాఫ్ లో కూడా ఇలాగే సాగుతుంది. సెకండాఫ్ లో బండి సరోజ్ పై కొన్ని సీన్స్ బానే లాక్కొచ్చారు కానీ మిగతా సీన్స్ మాత్రం ఎప్పుడో చూసేసినట్టు అనిపిస్తాయి.  ప్ర‌తినాయ‌కుడి పాత్ర రాక‌తో కాస్త సంద‌డి మొద‌లైనా, ఆ త‌ర్వాత ఆ పాత్ర కూడా రొటీన్ అయిపోతుంది. మూగ‌జీవితోనే నీ జీవితం అంతం అంటూ పండితుడు ప్ర‌తినాయ‌కుడిని శ‌పించే సన్నివేశాల‌తో ఈ సినిమా ఎలా ముగుస్తుందో అర్థం అవుతుంది.  ప్ర‌తీ స‌న్నివేశం పాత సినిమాల్నే గుర్తుకుతెస్తుందే త‌ప్ప కొత్త మ్యాజిక్ మ‌చ్చుకైనా క‌నిపించ‌దు. నిస్సారంగా సాగే స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధంలోనే ఈ సినిమా గాడి త‌ప్పిన‌ట్టు అనిపిస్తుంది. అయితే.. నాయ‌కానాయిక‌ల జోడీ, ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌, విజువ‌ల్స్‌, సంగీతం ఈ సినిమాని కాస్త చూడాల‌నిపించేలా చేస్తాయి.  

ఎవరెలా చేశారంటే... క‌థానాయ‌కుడు రోషన్ కనకాల  మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు ఎంతో స‌హ‌జంగా అనిపిస్తుంది.  నటుడిగా చాలా చక్కని హావ భావాలు పలికించాడు.  ముఖ్యంగా మోగ్లీ అనే అడవి కుర్రాడి పాత్రలో తాను ఇమిడిపోయాడు. ఆ పాత్రలోని ఒక అమాయకత్వాన్ని తన ముఖ కవళికలలో చాలా బాగా చూపించాడు. ఈ ఎమోషన్ మాత్రం రోషన్ లోని నటుడుని బాగా చూపించింది. రోషన్ ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. తన పాత్రలోని ఇన్నోసెన్స్ ని చాలా బాగా ప్రదర్శించాడు.  యంగ్ హీరోయిన్ సాక్షి మహాదోల్కార్ కూడా బాగా చేసింది. తనకిచ్చిన ప్రత్యేక పాత్రలో ఆమె ఒదిగిపోయింది.  త‌న అందంతో క‌ట్టిపడేసింది. డైలాగులు లేక‌పోయినా స‌రే, హావ‌భావాల‌తోనే పాత్ర‌పై బ‌ల‌మైన ప్ర‌భావం చూపించింది. రోషన్ తో కూడా ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఇక నటుడు పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అతడికి  మంచి రోల్ పడింది దానిని తాను కూడా బాగా పండించి ద్వితీయార్ధంపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాడు. తన పాత్ర డిజైన్ గాని ఆ పాత్రలో తానే ఎందుకు అనే అంశం ఈ సినిమాలో తాను పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. తనలో ఆల్రెడీ నెగిటివ్ షేడ్ చాలా మంది చూసి ఉండొచ్చు కానీ ఇందులో నెగిటివ్ షేడ్ కూడా సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. తన ఇంట్రో గాని సెకండాఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి.   అలాగే నటుడు సుహాస్ పోర్షన్ కూడా అంత కిక్ ఏమీ ఇందులో ఇవ్వలేదు. ఐకాన్ స్టార్ ని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసిన పోర్షన్స్ నాచురల్ గా అనిపించలేదు.  హ‌ర్ష చెముడు హీరో స్నేహితుడిగా చాలా సినిమాల్లో న‌టించినా... ఇందులో ఆయ‌న‌కు బ‌ల‌మైన పాత్ర దొరికింది.  ఇక వీరి అందరితో పాటుగా వైవా హర్షకి మంచి రోల్ పడింది. అక్కడక్కడా కామెడీ సీన్స్ ఇంకా ఎమోషనల్ గా కూడా తనపై కొన్ని సీన్స్ బాగున్నాయి.  

టెక్నీకల్ గా చూస్తే... ఈ సినిమాలో నిర్మాణ విలువలను మెచ్చుకోకుండా ఉండలేం.  దాదాపు సినిమాని రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే  రామ మారుతి కెమెరా ప‌నిత‌నం సినిమాకి హైలైట్‌ గా నిలిచింది.  అడ‌వి నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు బేషుగ్గా ఉంది.  సీన్ టు సీన్ మంచి ట్రాన్సిక్షన్స్ ఫస్టాఫ్ లో కనిపిస్తాయి. వి ఎఫ్ ఎక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.  కాల‌భైరవ సంగీతం కూడా మెప్పిస్తుంది. రెండు పాట‌లు బాగున్నాయి.  దర్శకుడు సందీప్ రాజ్ తాను ఈ సినిమాకి 'కలర్ ఫోటో' రేంజ్ లో ట్రీట్మెంట్ ఇద్దామనుకునే ప్రయత్నం చేశారు కానీ అందులో అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయారు.  కొన్ని సీన్స్ ని తగ్గించి మరింత గ్రిప్పింగ్ గా కథనాన్ని డిజైన్ చేసుకోవాల్సింది అలాగే సెకండాఫ్ లో లీడ్ జంటపై సీన్స్ ని మరో వెర్షన్ ని ట్రై చేయాల్సింది.  ప్రధాన పాత్రలు నుంచి మంచి నటన అయితే తాను రాబట్టగలిగారు కానీ సినిమాలో మెయిన్ పాయింట్ కోసం మిగతా కథనం సాగదీతగా లాగుతూ తీసుకెళ్లారు. ఎడిటింగ్ కొంత పట్టుతప్పినట్టుగా అనిపిస్తుంది. చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.  సో..సినిమా సాదాసీదా చిత్రంగా మిగిలిపోయింది.
ఇంకా చదవండి: 'అఖండ 2'మూవీ రివ్యూ : చూడాల్సింది బాలయ్య విధ్వంసం మాత్రమే!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# రోషన్ క‌న‌కాల‌     # మోగ్లీ    

trending

View More