'కుబేర' మూవీ రివ్యూ : దర్శకుడికే పరీక్ష పెట్టిన 'కుబేర'
5 months ago | 5 Views
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన తొలి మల్టీస్టారర్, పాన్ ఇండియా మూవీ 'కుబేర’. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల సైతం నిర్మాణ భాగస్వామి. నాగార్జున, ధనుష్, రష్మిక మందన కీలక పాత్రలు పోషించిన 'కుబేర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఉన్నవారికి, లేనివారికి మధ్య వ్యత్యాసం నానాటికి పెరిగిపోతోంది తప్పితే తగ్గడం లేదు. ధనవంతులు మరీ ధనవంతులు అవుతుంటే, బీదవారు ప్రభుత్వాల సబ్సిడీలతో జీవితాల్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సబ్సిడీలు రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాలు మాదిరిగా అయిపోయాయి. ప్రభుత్వాధీనంలో ఉండాల్సిన ప్రధాన రంగాలు సైతం నిదానంగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాటి ద్వారా కోటాను కోట్లు సంపాదిస్తున్న ఆ కంపెనీలే ప్రభుత్వాలను ఆటాడిస్తున్నాయి. అలాంటి ఓ కార్పొరేట్ టైకూన్ కథే 'కుబేర’. దేశంలోనే అత్యంత ధనికుడైన నీరజ్ మిత్ర (జిమ్ సార్బ్) కు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా నిలవాలనే కోరిక. దాంతో కేంద్ర మంత్రి సిద్థప్ప (హరీశ్ పేరడి)తో డీల్ కుదుర్చుకుని లక్షల కోట్ల లంచం ఇచ్చి బంగాళఖాతంలోని ఆయిల్ డిగ్గింగ్ ఏరియాను తన వశం చేసుకుంటాడు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లంచంలో సగం వైట్ లో, సగం బ్లాక్ లో ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నిజాయితీతో నడుచుకుని జైలు పాలైన సస్పెండెడ్ సీబీఐ ఆఫీసర్ దీపక్ రాజ్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అతన్ని జైలు నుండి బయటకు తీసుకొచ్చి... ఈ డీల్ ను ఫుల్ ఫిల్ చేసే పనిని అప్పగిస్తాడు. రంగంలోకి దిగిన దీపక్... నలుగురు బిచ్చగాళ్ళను ఎంచుకుని వారి ద్వారా కథ నడుపుతాడు. అలా వీరు ఎంచుకున్న దేవా (ధనుష్) అనే బిచ్చగాడి కారణంగా పరిస్థితులు చేజారిపోతాయి. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నీరజ్ ఇవ్వాల్సిన లక్షల కోట్ల లంచం ముట్ట చెప్పగలిగాడా? వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ కావాలనుకున్న నీరజ్ కోరిక నెరవేరిందా? తిరుపతిలో బిచ్చగాడిగా ఉన్న దేవా... ప్రభుత్వాలను శాసించగలిగే కార్పొరేట్ టైకూన్ జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేశాడు? అనేది 'కుబేర’ కథ.
విశ్లేషణ : రాజకీయ నాయకులకు బినావిూలు ఉన్నట్టే... కార్పొరేట్ సంస్థలు బినావిూలతో షెల్ కంపెనీస్ నిర్వహిస్తుంటాయి. వాటి ద్వారా కోటానుకోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ వంటి వారు వీరిని టచ్ చేసినా... చేతికి మట్టి అంటకుండా హాయిగా దులిపేసుకుంటారు. అనామకుల పేర్లతో దందాను సజావుగా నడిపేస్తుంటారు. ఇందులో ఆ అనామకులు నలుగురు బిచ్చగాళ్ళు! అదే ఈ కథలోని కొత్తదనం. దాంతో ఇది కోట్లకు పడగలెత్తిన ఓ మల్టీ మిలియనీర్ వర్సెస్ బెగ్గర్ కథగా మారిపోయింది. వీరిద్దరి మధ్యలో కథను నడిపేది ఓ సస్పెండెడ్ సీబీఐ ఆఫీసర్!! ఇలాంటి ఓ కథను మూడు గంటల సినిమాగా తీసి... ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా కష్టసాధ్యం. దర్శకుడిగా పాతికేళ్ళ అనుభవం ఉన్న శేఖర్ కమ్ముల వల్ల కూడా అది కాలేదు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు బిచ్చగాడి పాత్రలు చేయడానికి పోటీ పడుతున్నట్టుగా ఉంది. సినిమా మొత్తం కాకపోయినా.. కొన్ని సన్నివేశాలలో అయినా ఇలా డీ గ్లామర్ గా కనిపించడం జరుగుతోంది. ఇందులోనూ మల్టీమిలియనీర్ అయిన విలన్ తన డబ్బుల్ని కాపాడుకోవడానికి అలాంటి పనే చేస్తాడు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయాడు. అతని నటనను వంక పెట్టడానికి లేదు. నిజానికి ఇందులో ధనుష్ కంటే నాగార్జున పాత్రకే నిడివి ఎక్కువ. అతని క్యారెక్టరే 360 డిగ్రీస్ ఉంది. తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యే ఆ పాత్రను నాగ్ బాగానే చేశాడు. అయితే ఆ క్యారెక్టర్ కు సినిమాటిక్ ముగింపు ఇవ్వడంతో తేలిపోయింది. ఇక రశ్మిక మందణ్ణ పాత్రను చూస్తుంటే ’చూడాలని ఉంది’లో సౌందర్య గుర్తొస్తుంది. ఆమె ప్రమేయం లేకుండానే పలు సంఘటనల్లో ఇరుక్కుపోతుంది. ఈ సినిమా చేయడం కూడా అలాంటిదే అనిపిస్తోంది. నటీనటుల్లో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి జిమ్ సార్బ్. కార్పొరేట్ టైకూన్ గా అదరగొట్టేశాడు. మిగిలిన వారూ సందర్భోచితంగా నటించారు. నాగ్ భార్య పాత్రను సునయన చేసింది. అయితే ఎంచుకున్న కథలో దమ్ములేకపోవడం, దాన్ని సరిగా తెర విూద ప్రెజెంట్ చేయక పోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురికాకతప్పదు. సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని కథను రాసుకుని శేఖర్ కమ్ముల తప్పుచేశారనిపిస్తుంది.
ఇంకా చదవండి: అల్లు అర్జున్-అట్లీ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కుబేర # ధనుష్ # నాగార్జున # రష్మిక మందన్న # సునీల్ నారంగ్




