'భైరవం' మూవీ రివ్యూ : యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా!
6 months ago | 5 Views
(చిత్రం: భైరవం, విడుదల : మే 30, 2025, రేటింగ్ : 2.5/5, నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు, దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాణం: కె.కె. రాధామోహన్, సంగీతం : శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ : హరి కె వేదాంతం, ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్)
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటించిన సినిమా 'భైరవం'. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం (మే 30, 2025 ) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం...
కథ: తూర్పు గోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారి గుడి దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ (జయసుధ) తన మనవడు గజపతి (మంచు మనోజ్), వరద (నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ముగ్గురినీ సమానంగా పెంచుతుంది. ఈ క్రమంలో ఓ మంత్రికి దేవాలయం భూమి పై కన్ను పడుతుంది. ఆ తర్వాత నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు గజపతి మరియు వరద. అయితే, అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి చంపాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ?, ఈ మధ్యలో శ్రీను పాత్ర ఏమిటి ?, పోలీసులకు అబద్ధం చెప్పి, వరద భార్య(దివ్య పిళ్ళై) దగ్గర చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి శ్రీనుకి ఎందుకు వస్తుంది ?, శ్రీను, గజపతి కోసం ఎందుకు అబద్ధం చెప్పాడు ?, చివరికి అసలు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ‘భైరవం’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో ‘మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్’ ల నటన, యాక్షన్ సీన్స్ మరియు వారాహి అమ్మవారి ట్రాక్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఓకే . ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా సాగింది, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా రెగ్యులర్ గా సాగాయి. ముగ్గురు హీరోలు పోషించిన ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ ను అండ్ వారాహి అమ్మవారి ట్రాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో ఈ భైరవం’ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. నిజానికి సెకండాఫ్ స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ బాగున్నా.. మిగిలిన ప్లేలో కూడా ఉత్సుకతను పెంచి ఉంటే బాగుండేది. అలాగే, హీరోల మధ్య మనస్పర్థలను ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలాగే, శ్రీనివాస్ ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. మెయిన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ గ్రాఫ్ అండ్ ఆర్క్ ను ఇంకా బెటర్ గా చూపించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే, విలన్ పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉండాల్సింది. మొత్తానికి కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు విజయ్ కనకమేడల మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. కథా నేపథ్యంతో పాటు ప్రధాన నటీనటుల నటన మరియు వారి పాత్రలు ఆకట్టుకున్నాయి.
ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీను పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. ముఖ్యంగా అతనికి పూనకం వచ్చిన ఎపిసోడ్‌లలో చాలా బాగా నటించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ శ్రీనివాస్ మెప్పించాడు. అలాగే, డాన్స్, యాక్షన్ సీన్స్‌లో కూడా అదరగొట్టాడు. మంచు మనోజ్‌కి ఇది మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్. మంచిగా కనిపిస్తూనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనోజ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. మనోజ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన నేచురల్ లుక్స్ తో మనోజ్ సినిమాకే హైలైట్ గా నిలిచాడు. నారా రోహిత్ నటన కూడా చాలా బాగుంది. సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. సెటిల్ట్ గా ఉండాల్సిన పాత్రలో నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే సెటిల్డ్ గా ఉంది. ముగ్గురు హీరోలు ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా ఆకట్టుకునేలా నటించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మామ పాత్రలో నటించిన గోపరాజు రమణ కూడా బాగా నటించాడు. అజయ్ తో పాటు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక విభాగం : దర్శకుడు విజయ్ కనకమేడల కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. దర్శకుడు రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కోర్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు ఓకే. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత కె.కె రాధామోహన్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
ఇంకా చదవండి: యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మోహిత్ సూరి తెరకెక్కించిన ‘సైయారా’ టీజర్ విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# భైరవం # బెల్లంకొండ సాయి శ్రీనివాస్ # మనోజ్ మంచు # నారా రోహిత్




