'ఓజీ' సినిమాలో నేను పోషించిన 'కణ్మని' పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్
2 months ago | 5 Views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'ఓజీ' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో ముచ్చటించి చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ప్రయాణం గురించి చెప్పండి?
ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో.
ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?
మూవీ అనౌన్స్ మెంట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు నాకు ఈ కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నేను పోషించిన కణ్మని పాత్ర చాలా నచ్చింది. పైగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సుజీత్ గారు డైరెక్టర్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం. ఇంతకంటే ఏం కావాలి ఈ సినిమా ఒప్పుకోవడానికి.
కణ్మని పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇది 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని.
సువ్వి సువ్వి పాటకు ఈ స్థాయి స్పందన వస్తుందని ముందే ఊహించారా?
తమన్ గారితో మొదటిసారి పని చేశాను. ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట 'సువ్వి సువ్వి'నే. ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో ఎదురుచూశాను. విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మీకు ముందే తెలుసా..?
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అవధులు లేనిది. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసు. అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తెలిసిందే ఏంటంటే.. నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా.. పవన్ గారు ఒదిగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు.
సెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడేవారు?
ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు. చరిత్ర గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు.
షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సూచనలు ఇస్తుంటారా?
సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తుంటారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేస్తుంటారు. పవన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
మీరు సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. కొన్ని సన్నివేశాలు చూశాను. విజువల్ గా చాలా బాగున్నాయి.
ఇది యాక్షన్ సినిమా కదా.. ఫ్యామిలీ డ్రామా ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ గారు సెట్ లో ఎలా ఉన్నారు?
ఇప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారు. ఎక్కువగా ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు? రాజకీయాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు చర్చిస్తుంటారు. డిప్యూటీ సీఎం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన తన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సుజీత్ గారి గురించి?
సీన్ ఎలా తీయాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి.. ఇలా ప్రతి విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం సుజీత్ గారే.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ గురించి?
నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. డీవీవీ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట ఓజీ సినిమానే అంగీకరించాను. కానీ, సరిపోదా శనివారం చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య గారు, కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం.
తదుపరి ప్రాజెక్ట్ లు?
తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. అలాగే, వేరే భాషల్లో పలు సినిమాలు చేస్తున్నాను.
ఇంకా చదవండి: మోహన్‌లాల్ పాన్ ఇండియన్ మూవీ వృషభ టీజర్ సెప్టెంబర్ 18న రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఓజీ # ప్రియాంక అరుల్ మోహన్ # పవన్ కళ్యాణ్




