తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించేదాకా పోరాటం చేస్తాం - ప్రెస్ మీట్ లో నిర్మాతల అల్టిమేటం
4 months ago | 5 Views
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే పోరాటం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు నిర్మాతలు. ఈ రోజు హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె ఎస్ రామారావు, అశోక్ కుమార్, బసిరెడ్డి, డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, మోహన్ గౌడ్, విజయేందర్ రెడ్డి, వర్చువల్ గా నిర్మాత సి.కల్యాణ్, తదితర నిర్మాతలతో పాటు 150 మందికి పైగా నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - తెలుగు ఫిలింఛాంబర్ కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇలాంటి గొప్ప అసోసియేషన్ ను క్రమశిక్షణ ప్రకారం కొనసాగేలా చేయాలని కోరుతున్నా. ఇప్పుడున్న అధ్యక్షులు భరత్ భూషణ్ గారికి, ఇతర సభ్యులకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అసోసియేషన్ కు ఉన్న గౌరవాన్ని మనమంతా కాపాడుకుందాం. అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ - నేను ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమం కోసం కోల్ కతా వచ్చాను. అందుకే ఈ ప్రెస్ మీట్ కు రాలేకపోయా. తెలుగు ఫిలిఛాంబర్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి. ఈ అసోసియేషన్ ను ఒక పద్ధతిలో ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు కొందరు స్వార్థంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ తీసుకెళ్లి తిరుపతిలో పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. న్యాయపరంగా పోరాటం చేస్తాం అన్నారు.
నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - తెలుగు ఫిలింఛాంబర్ లో అనేక పదవులు నిర్వహించాను. ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోకు, ప్రొడ్యూసర్స్ కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ ఛాంబర్ కు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి తెలుగు ఫిలింఛాంబర్ లో నిరంకుశంగా మేమే కమిటీలో కొనసాగుతాం అనేది తప్పు. తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికల విషయంలో సీఎం రేవంత్ గారిని కలవబోతున్నాం. అలాగే మన ఎంపీలతో పార్లమెంట్ లోనూ ఈ విషయాన్ని లేవదీస్తాం అన్నారు.
నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ - తెలుగు ఫిలింఛాంబర్ ఈసీ మీటింగ్ లో అంబికా ప్రసాద్ అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పాడని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రెజెంట్ బాడీలో ఉన్న నాయకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఛాంబర్ మనకు దేవాలయం లాంటిది. ఇక్కడే తప్పు జరిగితే రేపు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి ఎలా మన సమస్యలు చెప్పుకుంటాం. ఈ నెల 30వ తేదీతో ఇప్పుడున్న కమిటీ గడువు ముగుస్తుంది. వెంటనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలి. ఇప్పుడున్న కమిటీలో నేనూ పదవిలో ఉన్నా, ఎన్నికలు లేకుంటే నాకూ మరోసారి అవకాశం వస్తుంది కానీ అలా జరగడం నిబంధనలకు విరుద్ధం. నేను ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని, మంత్రి పొంగులేటి గారిని కూడా కలిసి లెటర్స్ ఇచ్చాను. ఇక్కడైతే అంతా అడుగుతామని ఈసీ మీటింగ్ తిరుపతిలో పెట్టారు. ఇప్పటిదాకా రాష్ట్ర విభజన, కరోనా టైమ్ లో మాత్రమే తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు వాయిదా వేశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండే రేపటి నుంచి ఇక్కడే కూర్చుంటాం. మీరు తిరుపతిలో ఈసీ మీటింగ్ పెట్టినా మళ్లీ ఇక్కడికే రావాలి. మీరు ఎన్నికలు నిర్వహించేదాకా మా పోరాటం ఆగదు అన్నారు.
నిర్మాత విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ - తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు వాయిదా వేయడం ఇప్పుడున్న కమిటీనే కొనసాగించాలని చూడటం నిబంధనలకు విరుద్ధం. కొందరు తమ స్వార్థంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు ప్రభుత్వాలకు దగ్గరగా ఉన్నామనే కారణం సరైనది కాదు. ఎన్నికైన కమిటీతో పాటు మీలో పరిచయాలు ఉన్న వారు వచ్చి ప్రభుత్వాలకు రిప్రంజటేషన్స్ ఇద్దాం. దాని కోసం ఎలక్షన్స్ వాయిదా వేయడం ఏంటి. నేనే కాదు నాతో పాటు ఎంతోమంది తెలుగు ఫిలింఛాంబర్ లో కీలకమైన పదవులు నిర్వహించాం. కానీ ఇలా మేమే పదవుల్లో ఉండాలని అనుకోలేదు. ఎన్నికలు నిర్వహించి మళ్లీ మీరే గెలవండి. కానీ ఎన్నికల నిర్వహణ జరగాల్సిందే. అన్నారు.
నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ - తెలుగు ఫిలింఛాంబర్ కు ఎన్నికలు నిర్వహించాలని కోరడానికే మేమంతా ఈ ప్రెస్ మీట్ కు వచ్చాం. గత కొద్ది రోజులుగా వారికి నచ్చజెబుతున్నాం. ఇప్పుడున్న కమిటీలోని వారిలోనే కొందరికి ఈ నిర్ణయం నచ్చక రాజీనామాలు చేశారు. నేను తెలుగు ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశాను. నాతో పాటు ఇక్కడున్న వారిలో చాలా మంది పెద్ద పదవులు నిర్వహించారు. ఎవ్వరైనా నిబంధనల ప్రకారం వెళ్లాల్సిందే. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉంటే ఎన్నికలు నిర్వహించవద్దని ఎవరు చెప్పారు. నాకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో, జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. అయినంతమాత్రాన నేను ప్రెసిడెంట్ పదవిలో కూర్చుంటా అని అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని అంటున్నారు. ఎప్పుడో ఒకసారి తప్పు జరిగితే అది మళ్లీ జరగాలా. ఎన్నికలు నిర్వహించి మీకు సభ్యుల్లో ఆదరణ ఉంటే మళ్లీ గెలవండి అన్నారు.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




