‘కమిటీ కుర్రోళ్లు’ గద్దర్ అవార్డుల్లో సత్తా చాటారు: నిహారిక, యదు వంశీ సంతోషం వ్యక్తం
6 months ago | 5 Views
నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉండే అభిరుచి అందరికీ తెలిసిందే. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా ఆగస్టు 9, 2024న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్, ఓటీటీ ఇలా అన్ని చోట్లా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అంతే కాకుండా దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు. 14 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇలా రాష్ట్ర అవార్డుల్ని ప్రకటించింది. గద్దర్ పేరిట ఇవ్వనున్న ఈ అవార్డుల్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతా కొత్త వారితో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిహారి కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను అద్భుతంగా నిర్మించారు. నిర్మాణం పట్ల, సినిమా పట్ల ఆమె అంకితభావాన్ని ఈ చిత్రం చాటి చెప్పింది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇలా తన చిత్రం రెండు రాష్ట్ర అవార్డుల్ని సాధించడంతో నిహారిక కొణిదెల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు నిహారిక మాట్లాడుతూ .. ‘మా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు అవార్డులను గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమాను గుర్తించినందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, మొత్తం జ్యూరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మిగతా విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు’ అని అన్నారు.
తొలి చిత్రంతోనే దర్శకుడిగా యదు వంశీ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. స్నేహం, కుల వివక్ష, సామాజిక న్యాయం అనే ఇతివృత్తాలను తీసుకుని ఓ చక్కటి ఆహ్లాదకరమైన సినిమాను తెరకెక్కించారు. ఈ సున్నితమైన అంశాలను ఆకర్షణీయంగా, ఆలోచింపజేసే రీతిలో ప్రజంట్ చేయగల అతని సామర్థ్యమే అతనికి ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా అవార్డును తెచ్చిపెట్టింది.
ఈ విజయంపై యదు వంశీ స్పందిస్తూ .. ‘సినిమా రంగంలో యువ, నూతన ప్రతిభను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డులు నిస్సందేహంగా చాలా మంది యువ నటులు, చిత్రనిర్మాతలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నాకు, నా బృందానికి ఈ గౌరవాన్ని అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, జయసుధ గారు, గౌరవనీయులైన జ్యూరీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు మాకు చాలా ప్రేరణనిస్తుంది, ఇంకా అర్థవంతమైన కథలను చెబుతూనే ఉండటానికి స్ఫూర్తినిస్తుంది. మిగతా విజేతలందరికీ మరోసారి అభినందనలు’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ప్రాంతం నేపథ్యంలో తీసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ అక్కడి ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలను చక్కగా చూపిస్తుంది. ఈ చిత్రంలో సందీప్ సరోజ్, త్రినాధ్ వర్మ, పి. సాయి కుమార్, గోపరాజు రమణ, రాధ్య, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, యస్వంత్ పెండ్యాల వంటి వారు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ మూవీని నిర్మించారు. ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. మన్యం రమేష్ ప్రొడక్షన్ వ్యవహరాల్ని చూసుకున్నారు. కమిటీ కుర్రోళ్లు బృందం మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రభావవంతమైన చిత్రాలను అందిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని టీం హామీ ఇచ్చింది.
ఇంకా చదవండి: బీఎన్ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కమిటీ కుర్రోళ్లు # నిహారిక # యదు వంశీ




