‘మన సినిమా... ఫస్ట్ రీల్’ కు తెలంగాణ ప్రభుత్వ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్ – 2024’

‘మన సినిమా... ఫస్ట్ రీల్’ కు తెలంగాణ ప్రభుత్వ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్ – 2024’

6 months ago | 5 Views

రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, ఆయన రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం 2024వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ గ్రంథం’గా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వ తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు ఈ గౌరవం లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ గురువారం హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ సంగతి ప్రకటించింది.

 దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ళ పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి, భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన ఉద్ర్గంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ళ క్రితపు అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింద


తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ, మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ళ నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమనీ తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో నిర్ద్వంద్వంగా నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్ళం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామనీ గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ళ తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.

హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన తొట్టతొలి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ళ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఇది పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. అదిగో... ఈ రచనకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ గ్రంథం’గా ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది.  

 ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా, అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుండి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి ఈ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకంలో పొందుపరిచారు. పై పై వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ – పంపిణీ – ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్ళకు కట్టినట్టు తెలిపారు. తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు – డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ గారి సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి. 

తొలి పూర్తి నిడివి పది రీళ్ళ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన వెలికితీసిన ఫిబ్రవరి 6నే అధికారికంగా ‘తెలుగు సినిమా డే’ను జరుపుకొంటూ ఉండడం విశేషం.

 రెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ‘ఉత్తమ సినీ విమర్శకుడి’గా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ళ తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సైతం గుర్తించింది. ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని పురస్కరించుకొని, ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం.

ఇంకా చదవండి: ‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు - నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గద్దర్ ఫిల్మ్ అవార్డ్     # రెంటాల జయదేవను    

trending

View More