'హరి హర వీరమల్లు' సినిమాలో నటించడం నా అదృష్టం: కథానాయిక నిధి అగర్వాల్

'హరి హర వీరమల్లు' సినిమాలో నటించడం నా అదృష్టం: కథానాయిక నిధి అగర్వాల్

4 months ago | 5 Views

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.


ఇద్దరు దర్శకులు క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది?

క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు.

ఎ.ఎం. రత్నం గారి గురించి?

ఎ.ఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.

ట్రైలర్ కి వచ్చిన స్పందన ఎలా అనిపించింది?

ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్ కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది.

హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో, రాజాసాబ్ లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?

ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్ గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.


పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?

క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. మంచి పాత్ర కూడా దక్కింది.

హరి హర వీరమల్లులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశం?

భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది.

కీరవాణి గారి సంగీతం గురించి?

పీరియడ్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు. పైగా ఆస్కార్ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో తార తార, కొల్లగొట్టినాదిరో గీతాలు నాకు బాగా నచ్చాయి.

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?

మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది.

ఇంకా చదవండి: 'జూనియర్‌' ఫస్ట్ డే చూడాలన్న ఆసక్తి కలిగింది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# హరి హర వీరమల్లు     # పవన్‌ కల్యాణ్‌     # నిధి అగర్వాల్    

trending

View More