'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు..'-ప్రజాకవి, సినీ గేయ రచయిత అందెశ్రీ కన్నుమూత

'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు..'-ప్రజాకవి, సినీ గేయ రచయిత అందెశ్రీ కన్నుమూత

25 days ago | 5 Views

ప్రజా కవి, సినిమా పాటల రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రాసిన అందె శ్రీ (64) ఇక లేరు. ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆదివారం ఇంట్లో అస్వస్థతకు గురైన ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ సమాజం తీవ్రం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ పాటకి తీరని లోటని, పలువురు రచయితలు, తెలంగాణ వాదులు కొనియాడుతూ, సంతాపం తెలియజేస్తున్నారు.  అందెశ్రీ అనేక విప్లవాత్మక, అభ్యుదయ పాటలను రాశారు. తెలంగాణ కవిగా పాపులర్‌ అయ్యారు. తెలంగాణ రచనకు సంబంధించి విశేష సేవలందించారు. 2006లో గంగ అనే సినిమాకి గానూ నంది అవార్డుని అందుకున్నారు. వీటితోపాటు 2014లో అకాడమి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్ పీల్‌ డాక్టరేట్‌ని పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం దక్కించుకున్నారు. అలాగే అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితి పురస్కారం దక్కింది. ఆర్‌ నారాయణ మూర్తి తీసిన అనేక చిత్రాలకు అందెశ్రీ పాటలు రాయడం విశేషం. తన పాటలతో ప్రజలను చైతన్యం చేయడంలో అందె శ్రీది పైచేయి చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాటలు ఉర్రూతలూగించాయి. ఉద్యమం సక్సెస్‌ కావడంతో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి. ప్రజాకవిగా, ప్రకృతికవిగా, అభ్యూదయ రచయితగా సుప్రసిద్ధులైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 18 జూలై,1961 జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాధగా పెరిగారు. పెద్దగా చదువు లేదు. కాయకష్టం చేస్తూ తన పనిలోనే సాహిత్యాన్ని వెతుక్కున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. మొదట్లో అందెశ్రీ గొర్రెల కాపరిగా పని చేశారు. అందెశ్రీ పాటలు పాడటం శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ విని చేరదీసాడు. ఆయన ప్రోత్సాహంతో గొప్ప కవిగా, రచయితగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. ఆర్‌ నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. ఎంతో పాపులర్‌ పాటలను అందెశ్రీ రాసినవే. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఆయన గేయరచన చేశారు. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. అంతేకాదు బతుకమ్మ సినిమా కోసం డైలాగ్స్ కూడా రాశారు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ గీతం), పల్లెనీకు వందనములమ్మో, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా, 'జన జాతరలో మన గీతం', యెల్లిపోతున్నావా తల్లి, `చూడ చక్కని తల్లి వంటి పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. వీటితోపాటు అనేక పాటలను ఆయన రాశారు.   అలాగే రైటర్‌గా ఆయన అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని చెప్పొచ్చు. 


అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ... ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజాకవి అందేశ్రీ మరణం తెలుగు జాతికి తీరని లోటు : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి

ప్రజాకవి అందేశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు .\ఆయన… నా చిత్రాలు ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కల కు అమోఘ మైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశారు.  ఎర్ర సముద్రం లో మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది అది ఆ పాట గొప్పతనం.  ఊరు మనదిరా లోని చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేయడమే కాదు నాటికి నేటికి ఏ నాటికి చిరస్థాయిగా వుంటుంది అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా… అన్నిటినీ మించి జయ జయహే తెలంగాణా పాట తో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు.  ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి అమలు చేస్తున్నది. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను

ఇంకా చదవండి: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా "గత వైభవం" తెలుగులో గ్రాండ్ గా రిలీజ్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అందెశ్రీ     # ప్రజాకవి    

trending

View More