కోట శ్రీనివాసరావు ఇక లేరు...!
4 months ago | 5 Views
కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట శ్రీనివాసరావు విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్ ప్రసాద్ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు. అందువల్ల కోట తీరే వేరుగా నిలచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్ గా మెప్పించారు. ఆయన లాగే కొన్ని సినిమాల్లో లేడీ గెటప్ లోనూ మురిపించారు కోట. అయితే 'రెండిళ్ళ పూజారి'లో థర్డ్ జెండర్ గా నటించి కోట అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు. రావు గోపాలరావు లాగా కూడా సీరియస్ గా కొన్నిసార్లు, కామెడీతో మరికొన్ని మార్లు ప్రతినాయక పాత్రలు ధరించి ఉండవచ్చు. కానీ, తన గాత్రంతో వైవిధ్యం ప్రదర్శించారు కోట. నూతన్ ప్రసాద్ లాగా వాచికాభినయంతో కోట కూడా మైమరపించారు. అయితే తెలుగునేలపైని యాసలన్నిటినీ అచ్చు ఆ ప్రాంతాల్లోని వారు మాట్లాడే తీరునే వల్లించి జనం మనసులు గెలిచారు కోట. 'సెగట్రీ...' అంటూ రావు గోపాలరావులాగే కోట అభినయించిన దాఖలాలూ ఉన్నాయి. రావు గోపాలరావుకు మల్లె రాజకీయాల్లోనూ రాణించిన వైనమూ కోటలో కనిపిస్తుంది.
అయితే ఎవరిని అనుసరించినా, వారి పంథాను మాత్రం అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఏర్పరచుకున్నారు కోట. అందువల్లే కోట ఇకలేరన్న వార్త తెలియగానే ఇంతమంది మహానటులను గుర్తు చేసుకోవలసి వచ్చింది. వారి సరసన కూర్చోదగ్గ మేటి నటుడు కోట. అందులో ఏ మాత్రం సందేహం లేదు. 'ప్రతిఘటన'లో కాశయ్య పాత్రలో కోట అభినయం చూసి, కొందరు నటులు గుర్తుకు రావచ్చు. అయితే "హై కమాండ్ నడిగి చెబుతా..." అని తనదైన వాచకంతో సాగిన కోట నటన ... కాదు ఇతను ప్రత్యేకం అనిపించక మానదు. పిసినారి పాత్రల్లో పైన పేర్కొన్న నటులందరూ అలరించారు. కానీ, గుమ్మానికి కోడిని వేలాడ దీసి 'చికెన్ బిర్యానీ' తింటున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చారే - ఆ సీన్ లో ఆయనకంటే సీనియర్ గా జంధ్యాల సినిమాల్లో కనిపించిన సుత్తి వీరభద్రరావును సైతం పక్కకు నెట్టి మార్కులు పట్టేసిన తీరును మరచిపోగలమా? 'శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్'లో యెల్లా పాపారావు పాత్రలోనూ కొందరిలా కనిపిస్తారు. కానీ, వారందరికంటే భిన్నంగా వాగ్దాటితో తన బాణీ వేరని తేల్చి పారేస్తారు. 'శివ'లో కితకితలు పెట్టకుండానే మాచిరాజు పాత్రను రక్తి కట్టించారే - అది చూడగానే అది కదా విలక్షణమంటే అనిపించక మానదు. జంధ్యాల 'జయమ్ము నిశ్చయమ్మురా'లో సినిమా పిచ్చి పటేల్ గా నటించిన కోటను చూశాక అసలు నిన్ను ఇతరులతో పోల్చలేమయ్యా అని అంగీకరించేస్తారు. ఇక తెలుగునాట 'దెబ్బలతో అబ్బా' అనిపించేలా నవ్వించారు కోట. ఆయనను హీరోలు కొట్టినప్పుడు నవ్వులు పూసేవి.
అలాగే కోట, బాబూ మోహన్ కలసి 'తన్నుల'తో టన్నుల కొద్ది హాస్యాన్ని తెలుగువారి సొంతం చేసిన తీరునూ మరచిపోగలమా? అంతకు ముందు కొందరు మహానటులు మాయల ఫకీర్లుగా రక్తి కట్టించారు. వారి వికృత వేషధారణ చూసి జనం జడుసుకున్నారు కూడా! అంత కంటే విలక్షణంగా 'గణేశ్' చిత్రంలో వికృతరూపంతో విలనీని పండించిన కోటకు జనం జేజేలు కొట్టకుండా ఉండలేకపోయారు. కాసులకోసం ఏమైనా చేసే కక్కుర్తి వెధవల పాత్రల్లోనూ కోట అలరించిన తీరు అనితరసాధ్యమే అనిపిస్తుంది. 'ఆమె'లో అలాంటి పాత్రతోనే విధవరాలయిన కొడుకు భార్యనే డబ్బుల కోసం సొంతం చేసుకోవాలని చూసే పాత్రలోనూ కోట మెప్పించారు. ఆ పాత్రలో కోట మెప్పించక పోతే, కట్టుకున్న పెళ్ళామే అతడిని నరికి పారేస్తుంటే 'అలా జరగాల్సిందే... 'అని జనం కసిగా అనేవారు కారు. కేవలం కితకితలు పెట్టి నవ్వించడం వల్లో, భయపెట్టి ప్రతినాయక పాత్రలు ధరించడం వల్లో కోటను మహానటుడు అంటే అది కొంతే అవుతుంది. ఆయనలోని మరోకోణం పలు చిత్రాలలో కన్నీరూ పెట్టించింది. "లిటిల్ సోల్జర్స్, ఆ నలుగురు" సినిమాలు అందుకు నిదర్శనం. కోటలోని విలక్షణానికి రంకెలు వేస్తూ 'నంది' ఆయన ఇంట ఎనిమిది సార్లు వచ్చి చేరింది. నాలుగు సార్లు బెస్ట్ విలన్ గా, మూడు సార్లు బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా, ఓ సారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు కోట. ఆయన ఇక లేరు అన్న వార్త అభిమానులను ఆవేదనతో ముంచెత్తక మానదు. కానీ, ఆ నటనల కోట ఏనాడూ బీటలు వారదు. భవిష్యత్ లోనూ చెక్కుచెదరని దుర్గంలా నిలచే ఉంటుంది. శ్రీనివాసరావు ధరించిన వందలాది విలక్షణమైన పాత్రలు ఆ కోటను పరిరక్షిస్తూనే ఉంటాయి.
ఇంకా చదవండి: పవన్ షూటింగ్ స్పాట్‌లో చిరు ప్రత్యక్షం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కోట శ్రీనివాసరావు




