ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం 'హరి హర వీరమల్లు' : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం
4 months ago | 5 Views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అలాగే తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?
17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.
హరి హర వీరమల్లు ప్రయాణం గురించి చెప్పండి?
నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందే అనుకున్నారా?
మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా?
జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము.
పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి?
ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా?
ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.
ఇంకా చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' నుంచి పూజా హెగ్డే ది ఎక్స్‌ప్లోజివ్ స్పెషల్ నంబర్ మోనికా రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




