గద్దర్ సినీ అవార్డులకు తరలిరానున్న తారాలోకం
5 months ago | 5 Views
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సినీ అవార్డుల వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ తరలిరానుంది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన తెలుగు సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి సినీ ప్రముఖులు విశేషంగా హాజరుకానుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైటెక్స్ వేదికగా వేలాది మంది ఆహుతులు, అభిమానులు, వీఐపీలు, సెలబ్రిటీల సమక్షంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరగనుంది. మొత్తం 11 సంవత్సరాలకు గద్దర్ పురస్కారాలు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండ తదితరులు అవార్డు కార్యక్రమంలో సందడి చేయనున్నారు.
ఉత్తమ చిత్రాలతోపాటుగా ప్రకటించిన ప్రత్యేక పురస్కారాలు ఈ వేడుకలకు అదనపు ఆకర్షణ కానుంది. ఎన్టీఆర్ జాతీయ సినిమా పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, పైడి జైరాజ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు మణిరత్నం, బీఎన్‌రెడ్డి ఉత్తమ దర్శక పురస్కారం సుకుమార్‌కు, నాగిరెడ్డి-చక్రపాణి ఉత్తమ నిర్మాత అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావుకు, కాంతారావు అవార్డుకు విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారం యండమూరి వీరేంద్రనాథ్‌ను ఎంపికచేయడం తెల్సిందే. అలాగే వివిధ సంవత్సరాలలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు తదితరులకు కూడా అవార్డులు లభించాయి.
రాష్ట్ర విభజనకు ముందు నంది అవార్డులను బహుకరించేవారు. అయితే తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లపాటు సినిమా అవార్డులను అటక ఎక్కించారు. దీంతో సినీలోకం అసంతృప్తిగా ఉండిపోయింది. మధ్యమధ్యలో సినీ అవార్డులను పునరుద్ధరించాలని పరిశ్రమ పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే రేవంత్ రెడ్డి సర్కారు ఈ అవార్డులను పునరుద్దరిస్తామని ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దివంగత విప్లవ కవి, ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరిట సినిమా అవార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు పరిశ్రమ పెద్దల అభిప్రాయాలను తెలుసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ గౌరవించడంతో, అవార్డుల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది.
ఇంకా చదవండి: గ్లామరస్ ఫోటోలతో సోషల్‌మీడియాని షేక్ చేస్తున్న తెలుగమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 # జూనియర్ ఎన్టీఆర్ # మహేశ్‌బాబు




