సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. 'హరి హర వీరమల్లు' గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. 'హరి హర వీరమల్లు' గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

4 months ago | 5 Views

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 23(బుధవారం) సాయంత్రం వైజాగ్ లో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "వైజాగ్ అనేది నా హృదయానికి దగ్గరగా ఉండే ఊరు. నేనొక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కదా.. రకరకాల ఊళ్ళకు ట్రాన్స్ ఫర్ లు అవుతాయి. అందుకే ఎన్నో ఊళ్ళతో నాకు అనుబంధం ఉంటుంది. నేను అప్పుడు పెద్దగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి గారు నన్ను సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ కోసం విశాఖపట్నం పంపించారు. అలా విశాఖతో నాకు పరిచయం. ఉత్తరాంధ్ర ఆట పాటను సత్యానంద్ గారు నా గుండెల్లో అణువణువునా నింపారు. అలాగే గత ప్రభుత్వం నన్ను విశాఖలో అరెస్ట్ చేసి, ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇక్కడి ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. అందుకే విశాఖలో ఈ ఈవెంట్ నిర్వహించాలి అనుకున్నాను. నేను ఈరోజు ఉపముఖ్యమంత్రిగా కాకుండా, మీ హీరో పవన్ కళ్యాణ్ గానే మాట్లాడతాను. గత ప్రభుత్వంలో అందరి హీరోల సినిమాలకు రూ.100-150 టికెట్ రేట్లు ఉంటే.. నా సినిమాకి మాత్రం రూ.10-15 ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ సినిమాకి విజయాన్ని అందించిన మీకు ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి సినిమాలతో పాటు నా సినిమాకి కూడా టికెట్ రేట్ల పెంపుకి అవకాశం లభించింది. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. నెల రోజులుగా సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్న నిధి అగర్వాల్ గారికి నా అభినందనలు. నేను ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనను. నా సినిమా చూడండి అని అడగటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇవ్వడమే తెలుసు కానీ, అడగటం తెలీదు. అలాంటి నిధిని చూసి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా కోరికలు లేవు. హీరో అవ్వాలి, డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. అన్యాయాన్ని ఎదిరించాలి, సాయం చేయాలి అనే ఆలోచనలు తప్ప వేరే ఏమీ ఉండేవి కావు. అలాంటి నన్ను సత్యానంద్ గారి దగ్గరకు పంపారు అన్నయ్య చిరంజీవి గారు. అప్పుడు నేను బాగా సిగ్గుపడే వాడిని. అలాంటి నేను నటన కంటే ముందు.. సత్యానంద్ గారి నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నాను. మా అన్నయ్య, వదినల నమ్మకమే నన్ను ఇంతాడివాడ్ని చేసింది. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఏఎం రత్నం గారు నాతో పెద్ద సినిమా తీయాలనే కోరికతో క్రిష్ గారితో ఈ సినిమా కథ చెప్పించారు. కరోనా మరియు రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పాలన పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయాన్ని కేటాయించి షూటింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాకి మూల కారణం క్రిష్ గారు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాని పూర్తి చేయలేకపోయారు. రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ గారు దర్శకత్వ బాధ్యతలు తీసుకొని.. తక్కువ కాలంలో ఎఫెక్టివ్ గా సినిమాని పూర్తి చేశారు. క్రిష్ గారి కథకి మార్పులు చేర్పులు చేసి.. విపరీతమైన శ్రమలో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. రికార్డుల గురించి నేనెప్పుడూ మాట్లాడను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కీరవాణి గారు లేకపోతే హరి హర వీరమల్లు లేదు. మాకంటే ఈ సినిమాని ఎక్కువగా నమ్మారు. సినిమాని తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్ళారు. నాటు నాటు పాటతో కీరవాణి గారు ఆస్కార్ తీసుకురావడం మనందరం గర్వించదగ్గ విషయం. సినిమా అనేది వినోదంతో పాటు, విజ్ఞానం అందించాలనేది నేను నమ్ముతాను. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సనాతన ధర్మం గురించి ఉంటుంది. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి ఉపయోగపడ్డాయి. అభిమానుల కోసం గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అన్నారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, "ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు బల్లగుద్ది చెప్తున్నా అంటారు. ఈ వేదికగా నేను బల్లగుద్ది చెప్తున్నాను. హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండుగ రాబోతుంది." అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, "నాన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాని నాన్న గారు తన మొదటి సినిమాలా ఎంతో కసితో చేశారు. ఆయన నమ్మకం నిజమై అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఆయన ఒక అద్భుతమైన ఫైట్ ను కూడా డిజైన్ చేశారు. 'హరి హర వీరమల్లు' కోసం పవన్ కళ్యాణ్ గారు ఫైర్ తో వర్క్ చేశారు. ఆయన ఇచ్చిన ఫైర్ తోనే అసలు విశ్రాంతి తీసుకోకుండా ఈ సినిమాని పూర్తి చేశాను. పవన్ కళ్యాణ్ ఓ వైపు ప్రజా సేవ చేస్తూనే, మా సినిమాని పూర్తి చేశారు. నిధి అగర్వాల్ గారు వేరే అవకాశాలను కూడా వదులుకొని ఐదేళ్లు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. 'హరి హర వీరమల్లు' చిత్రం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను." అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, "పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడి పనిచేశాం. రత్నం గారు లేకుండా ఈ సినిమా లేదు. జ్యోతికృష్ణ గారు ఎంతో కష్టపడ్డారు. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.

ఇంకా చదవండి: ఉన్ని ముకుందన్ హోరోగా లెజెండరీ డైరెక్టర్ జోషీ కొత్త చిత్రం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# హరి హర వీరమల్లు     # పవన్‌ కల్యాణ్‌    

trending

View More