‘జయభేరిలో ‘అతడు’ గొప్ప సినిమా: మురళీమోహన్’

‘జయభేరిలో ‘అతడు’ గొప్ప సినిమా: మురళీమోహన్’

4 months ago | 5 Views

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి ఈ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ప్రసాద్ అండ్ టీం సహకరించింది. రైటర్‌గా త్రివిక్రమ్ గారు మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేసి, ఆయనతో మొదటి సినిమా చేయాలని అనుకున్నాం. ఆ టైంలో కథ చెప్పమని ఆయన్ను పిలిపించాం. స్రవంతి కిషోర్ గారికి మాటిచ్చాను.. వారి బ్యానర్‌లో సినిమా చేసిన తరువాత మీ వద్దకు వస్తానని త్రివిక్రమ్ అన్నారు. ఆ తరువాత మా వద్దకు వచ్చి మూడు గంటల పాటుగా ఈ ‘అతడు’ కథను కళ్లకు కట్టినట్టుగా చెప్పారు.

హీరో అంటే సుగుణాభిరాముడు అని అంతా అనుకునేలా పాత చిత్రాలు వస్తుండేవి. కానీ ఇందులో హీరో పాత్ర కాస్త నెగెటివ్ ధోరణిలో ఉంది కదా? అని అంటే.. ఇప్పుడు అదే ట్రెండ్ అని త్రివిక్రమ్ అన్నారు. సరే అని అంతా ఆయన మీదే భారం వేశాం. ఓ ఇంటి సెట్‌ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. దాదాపు 90 శాతం సీన్లు అదే సెట్‌లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్‌ను చాలా మంది వాడుకున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ‘అతడు’ మూవీ కోసం మహేష్ బాబు గారు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా సరే మహేష్ బాబు గారు ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. బుల్లితెరపై ‘అతడు’ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చింది. 

Athadu (2005)

నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్ గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ముందు ప్రియాంక ఆధ్వర్యంలో జయ భేరి ఆర్ట్స్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. రీ రిలీజ్ కోసం గత కొన్నేళ్ల నుంచి అందరూ నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. జితేంద్ర వచ్చి అడిగిన తరువాత కాదనలేకపోయాను. ‘అతడు’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీదకు సినిమాను తీసుకు రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ‘అతడు’ సినిమాలోని ప్రతీ డైలాగ్‌ను జనాలు ఇప్పటికీ వాడుకుంటూనే ఉంటారు. సెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీని చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందని అన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్‌‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు. అప్పటికే అధునాతన సాంకేతికతో ‘అతడు’ మూవీని తీశాం. అద్భుతమైన డైలాగ్స్‌తో త్రివిక్రమ్ అందరినీ మెప్పించారు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యారు. 

నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు. ‘నాకు వేషం ఇవ్వండి అని ఎవ్వరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు. అందుకే ఇంత వరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ‘అతడు’ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్‌కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు థియేటర్లో మాత్రమే సినిమాలు చూస్తుండేవారు. ఆ తరువాత టీవీలు వచ్చాయి. కానీ ఇప్పుడు రకరకాల మాధ్యమాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు థియేటర్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. టెక్నికల్‌గా ‘అతడు’ని అప్ గ్రేడ్ చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి థియేటర్‌కు వచ్చి సినిమాను చూడాలంటే తలకు మించిన భారంగా మారింది. పార్కింగ్, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు, టికెట్లు రేట్లు ఇలా అన్నీ ఎక్కువగా పెరిగాయి. ‘అతడు’ ప్రొడక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ మొత్తం బాధ్యతను తీసుకున్నారు. షూటింగ్, షెడ్యూల్స్ కాస్త ఆలస్యం అయ్యాయి. కానీ అనుకున్నట్టుగా మూవీని త్రివిక్రమ్ తీశారు. 

ఇక ఇందులో నాజర్ గారు పోషించిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్‌ను పంపించాం. కానీ శోభన్ బాబు గారు మా ఆఫర్‌ను తిరస్కరించారు. హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. త్రివిక్రమ్ గారు ‘అతడు’ మూవీని చాలా డిఫరెంట్‌గా తీశారు. ఆ టైంలో ఈ మూవీ ఓవర్సీస్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’ అని అన్నారు.

మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ .. ‘‘అతడు’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్‌ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామ’ని అన్నారు.

జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ మూవీని థియేటర్లో చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తాయి’ అని అన్నారు.

ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని మాట్లాడుతూ .. ‘సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న ‘అతడు’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నాం. నాకు ‘అతడు’ చిత్రం చాలా ఇష్టం. రీ రిలీజ్ అని తెలిసిన వెంటనే నేను వెళ్లి సంప్రదించాను. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల కంటే ఎక్కువగా కలెక్షన్లను సాధిస్తుందని నమ్ముతున్నాను. మరోసారి ‘అతడు’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నామ’ని అన్నారు.

ఇంకా చదవండి:  ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అతడు     # మహేష్ బాబు    

trending

View More