55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో
1 month ago | 5 Views
మలయాళ సినిమాకు ఇది ఒక అద్భుతమైన క్షణం. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' గతేడాది అత్యధిక ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం.. తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లో సత్తా చాటింది. నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది. కొత్త తరహా కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో ఈ చిత్రం మలయాళ సినీప్రపంచంలో కొత్త మైలురాయిని సృష్టించింది. 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో 'భ్రమయుగం' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు. తాంత్రిక విద్యలు తెలిసిన కొడుమోన్ అనే పాత్రలో మమ్ముట్టి తన అసాధారణ నటనతో కట్టిపడేశారు.
ఈ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరు.. భారతదేశపు అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయన స్థాయిని పునరుద్ఘాటించింది. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక సరిహద్దులను చెరిపివేసి.. మలయాళ సినిమా ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా 'భ్రమయుగం' నిలిచింది. నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సినిమా సృజనాత్మక దృష్టిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ అవార్డులు ప్రయోగాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.” అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. గత సంవత్సరం విడుదలై విశ్వవ్యాప్త ప్రశంసలు అందుకున్న 'భ్రమయుగం' చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు. మంత్రముగ్ధులను చేసే కథనం, అద్భుతమైన సంగీతం, విశిష్టమైన దృశ్య శైలి ఈ సినిమాని క్లాసిక్ గా మలిచాయి. అంతేకాదు, ఇటీవలి కాలంలో అత్యంత చర్చించబడిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిపాయి. 'భ్రమయుగం' సినిమా మమ్ముట్టి నట వైభవాన్ని మరలా రుజువు చేయడమే కాకుండా, కేరళ సినిమాకు ఒక మలుపుగా నిలిచింది. సరికొత్త ఆలోచనలతో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకునే వారిలో ధైర్యాన్ని నింపింది
ఇంకా చదవండి: మహేష్‌చంద్ర దర్శకత్వంలో ‘పిఠాపురంలో’
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




