ఈ నెల 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న యానిమేషన్ సిరీస్

ఈ నెల 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న యానిమేషన్ సిరీస్

11 days ago | 21 Views

ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్,  నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మీడియా మిత్రులకు ఈ యానిమేషన్ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో...  

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కంటెంట్ హెడ్  గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ - బాహుబలి యానిమేషన్ సిరీస్ తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, గ్రాఫిక్ ఇండియాతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. యానిమేషన్ సిరీస్ లు అంటే పిల్లలకే అనే అభిప్రాయం ఉంది. అయితే మేము ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’  యానిమేషన్ సిరీస్ ను పెద్దల దగ్గరకు కూడా చేర్చాలని అనుకుంటున్నాం. ఈ నెల 17వ తేేదీ నుంచి ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ని డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ - బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. ఈ స్క్రిప్ట్ రాసేప్పుడు ప్రతి పాత్రకు బ్యాక్ స్టోరీ, క్యారెక్టర్ ఆర్క్, తర్వాత కథను కూడా రాశాం. ఆ కంటెంట్ అంతా ప్రేక్షకులకు చెప్పాలని ఉండేది. మన దగ్గర సినిమా అంటే సినిమానే. థియేటర్ రన్ ముగిశాక దాని గురించి మర్చిపోతాం. కానీ వెస్ట్రన్ సినిమాలో సినిమా అంటే ఒక బ్రాండ్. అలా బాహుబలిని కూడా యానిమేషన్ సిరీస్ లు, కార్టూన్ బుక్స్, గేమింగ్ తో బ్రాండ్ చేయాలని భావించాం. కానీ మాకు సరైన పార్టనర్స్ దొరకక ఇన్నాళ్లూ వెయిట్ చేశాం. డిస్నీ, గ్రాఫిక్ ఇండియాతో ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’  సిరీస్ చేయడం హ్యాపీగా ఉంది. బాహుబలి సోల్ ఏంటో ప్రపంచానికి తెలుసు. దాన్ని ఈ యానిమేషన్ సిరీస్ తో మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

గ్రాఫిక్ ఇండియా నుంచి శరద్ దేవరాజన్ మాట్లాడుతూ - ఇండియన్ సినిమా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేంత గొప్పగా ప్రేక్షకులకు చేరువైంది. దీన్ని యానిమేషన్ సిరీస్ గా చేసేందుకు అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, శోభు గారికి థ్యాంక్స్. వారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఒక ఫీచర్ ఫిల్మ్ లో ఉండే డ్రామా, యాక్షన్, ఇంటెన్సిటీకి ఏమాత్రం తగ్గకుండా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’  యానిమేషన్ సిరీస్ రూపొందించాం. ఈ సిరీస్ చూసే వాళ్లకు ఇదొక యానిమేషన్ అని మర్చిపోయి ఆ పాత్రల్లో లీనమవుతారు. అన్నారు.

నటుడు శరద్ కేల్కర్ మాట్లాడుతూ - బాహుబలి ఆత్మను మరింతగా ముందుకు తీసుకెళ్లనుంది ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. హిందీలో బాహుబలి పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా కెరీర్ లో గర్వపడే విషయం. ఈ యానిమేషన్ సిరీస్ లోనూ హిందీకి డబ్బింగ్ చెప్పిన వాళ్లందరి వాయిస్ లు ఉంటాయి. ఈ గొప్ప ప్రాజెక్ట్ లో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. బాహుబలిని ఎంతగా ఆదరించారో ఈ సిరీస్ ను కూడా అంతగానే ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - యానిమేషన్ రంగంలో పయనీర్స్ లాంటి గ్రాఫిక్ ఇండియాతో మేము చేతులు కలపడం సంతోషంగా ఉంది. బాహుబలి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడ కథలోని విస్తృతిని మరింతగా ప్రేక్షకుల దగ్గరకు చేర్చాలని అనుకున్నాం. ఈ ప్రయాణంలో బాహుబలి సినిమా ఒక అధ్యాయం మాత్రమే. కార్టూన్, గేమింగ్, యానిమేషన్..ఇలా బాహుబలి జర్నీ సాగుతూనే ఉంటుంది. బాహుబలికి దక్కిన ఆదరణ మాకెంతో ధైర్యాన్నిచ్చింది. ఆ ప్రయాణంలో ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’  యానిమేషన్ సిరీస్ మీ ముందుకు వస్తోంది. బాహుబలి సినిమా లాగే సిరీస్ కూడా మిమ్మల్ని అలరిస్తుంది. అన్నారు.

ఇంకా చదవండి: ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ 'సివంగి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్న ప్రముఖ సినిమాటోగ్రఫర్ భరణి కే ధరన్

# Baahubali     # Prabhas     # Rana Daggubati    

trending